Rubek's Cube: సెకనుకన్నా తక్కువ టైంలోనే రూబీస్ క్యూబ్ పజిల్ పూర్తి చేసిన రోబో.. వీడియో వైరల్

Robot Sets Guinness World Record By Solving Rubiks Cube in Under a Second
  • మానవ కన్ను చూడలేనంత వేగంతో ఆట ఆడిన రోబో
  • రోబోను రూపొందించిన జపాన్ కంపెనీ మిత్సుబిషి కార్పొరేషన్
  • గిన్నిస్ రికార్డు సొంతం.. ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పంచుకున్న గిన్నిస్ బుక్

రూబీస్ క్యూబ్.. మెదడు చురుకుదనాన్ని పెంచే ఆట. ఇందులోని వేర్వేరు రంగులను ఒక్కో వైపు వచ్చేలా క్యూబ్ ను కదిలించడం అంత సులువేం కాదు. కొత్తగా ఆడే వారికి కొన్ని గంటలు.. ఒక్కోసారి రోజుల సమయం కూడా పడుతుంది. కానీ చేయి తరిగిన ఆటగాళ్లు మాత్రం దీన్ని నిమిషంలోనే పూర్తి చేస్తారు. మరి ఇదే ఆటను రోబో ఆడితే ఎంతసేపట్లో పూర్తి చేయగలదు? 

ఈ ప్రశ్న జపాన్ లోని ప్రఖ్యాత కంపెనీ మిత్సుబిషి కార్పొరేషన్ కు వచ్చింది. ఇంకేముంది..  వెంటనే ఓ రోబోను సిద్ధం చేసి దాని చేతిలో 3×3×3 కొలతల్లో ఉన్న రూబీస్ క్యూబ్ ను పెట్టింది. మరి తన సత్తాకు పరీక్ష పెడితే రోబో ఊరుకుంటుందా? ఇలా రెప్పవాల్చి తెరిచేలోగా పజిల్ ను పూర్తి చేసేసింది! అంటే పజిల్ ను ఒక సెకనుకన్నా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసిందన్నమాట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 0.305 సెకన్లలోనే ఆటను ముగించింది. దీన్నే మరోలా చెప్పాలంటే మనిషి కన్ను చూడలేనంత వేగంతో పజిల్ ను ఫినిష్ చేసిందన్నమాట. 

ఈ నెల 21న టోక్యోలో జరిగిన ఈ పోటీ చూసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు వెంటనే తమ పుస్తకంలో ఈ రోబో పేరుతో రికార్డు నమోదు చేసేశారు. ‘కదిలే పజిల్ క్యూబ్ ను అత్యంత వేగంగా పూర్తి చేసిన రోబో’ అంటూ రికార్డు కట్టబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమ ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లంతా రోబో వేగానికి అవాక్కయ్యారు.

మిత్సుబిషి ఎలక్ట్రిక్ కు చెందిన పరికరాల ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే టొకోయ్ అనే ఇంజనీర్ తన బృందంతో కలిసి ఈ రోబోను తయారు చేశారు. తాము తయారు చేసే పరికరాలు నాణ్యమైనవనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాలనుకున్నట్లు చెప్పారు.

రూబీస్ క్యూబ్ పజిల్ ను అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా చైనాకు చెందిన యిహింగ్ వాంగ్ పేరిట గిన్నిస్ రికార్డు ఉంది. అతను 4.48 సెకన్ల వ్యవధిలోనే పజిల్ ను ముగించాడు.

View this post on Instagram

A post shared by Guinness World Records (@guinnessworldrecords)

  • Loading...

More Telugu News