KTR: రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేటీఆర్

KTR fires at Revanth Reddy
  • రేవంత్ రెడ్డి రైతు నాయకుడు కాదని... రియల్ ఎస్టేట్ వ్యాపారి అని ఆరోపణ
  • పాలనలో మార్పు అంటే ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను హత్య చేయడమేనా? అని నిలదీత
  • కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాకోరు రాజకీయం చేస్తోందని మండిపాటు
  • తెలంగాణ పన్నులతో ఢిల్లీకి కప్పం కడుతున్నారన్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు నాయకుడు కాదని... రియల్ ఎస్టేట్ వ్యాపారి అని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రైతులను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేద ఆడబిడ్డలకు తులం బంగారం కాదు కదా... తులం ఇనుము కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలనలో మార్పు అంటే ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలను హత్య చేయడమేనా? అని మండిపడ్డారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి... ఇప్పుడు సన్న వడ్లకే అని మెలిక పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాకోరు రాజకీయం చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పాలనను ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నారన్నారు. నా రాష్ట్రం దివాలా తీసిందని ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్లు ఇచ్చారని... కరెంట్ ఇబ్బందులు లేకుండెనని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ బోగస్ సర్కార్‌గా మారిందన్నారు. రుణమాఫీపై రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల సమయంలో ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బ్రూ (BRU-భట్టి, రేవంత్, ఉత్తమ్) మొదలైందన్నారు. తెలంగాణ పన్నులతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు.

  • Loading...

More Telugu News