Bangladesh: 'హనీ ట్రాప్'తో రప్పించి.. చర్మం ఒలిచి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి..! బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కొత్త కోణం!

Bangladesh MP Murdered By Illegal Immigrant Who Peeled Skin Chopped Body
  • పోలీసుల విచారణలో నేరం తీరును వివరించిన నిందితుడు
  • మృతదేహాన్ని ఎవరూ గుర్తించరాదనే ముక్కలు చేసినట్లు వెల్లడి
  • ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్ కతా నలువైపులా పడేశామన్న జిహాద్ హవ్లాదార్
  • హత్యకు ముందు ఓ మహిళ, ఇద్దరు పురుషులతో కలసి ఎంపీ అపార్ట్ మెంట్ లోకి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తింపు
  • మహిళతో హనీ ట్రాప్ (వలపు వల) చేసి ఆయన్ను రప్పించినట్లు పోలీసుల అనుమానం 

కోల్ కతాలో ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

నిందితుల్లో ఒకడైన బంగ్లాదేశ్ అక్రమ వలసడారుడు జిహాద్ హవ్లాదార్ ను ముంబైలో పట్టుకున్నారు. తాను హత్య ఎలా చేసిందీ పోలీసుల విచారణలో అతను వివరించాడు. 

బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజ్జామన్ ఆదేశాలతో తనతోపాటు మరో నలుగురు బంగ్లా జాతీయులు ఈ హత్యలో పాల్గొన్నట్లు చెప్పాడు. 

కోల్ కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఉన్న అపార్ట్ మెంట్ లో ఎంపీని తొలుత గొంతు నులిమి చంపామని పేర్కొన్నాడు. 

మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందు చర్మం ఒలిచి ఆ తర్వాత శరీర భాగాలు, ఎముకలను చిన్నచిన్న ముక్కలుగా చేసినట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం శరీర ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్ కతా నలువైపులా పడేసినట్లు నిందితుడు వివరించినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి.

వైద్య చికిత్స కోసం మే 12న బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనార్ కోల్ కతా వచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఎంపీ శరీర భాగాల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు ఈ హత్య కేసులో హనీ ట్రాప్ (వలపు వల) కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం మహిళ ద్వారా హనీ ట్రాప్ చేయించి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో ఉంటున్న ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్‌హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌ లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఎంపీ.. ఆ తర్వాత తిరిగిరాలేదని పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి గుర్తించారు. 

‘బంగ్లా ఎంపీని ఓ మహిళతో హనీట్రాప్‌ చేయించి ఆ అపార్ట్‌మెంట్‌లోకి రప్పించి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నాం. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలే. ఫ్లాట్‌ లోకి వెళ్లగానే ఎంపీని నిందితులు గొంతునులిమి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నాం’ అని పశ్చిమ బెంగాల్‌ సీఐడీ అధికారి ఒకరు వెల్లడించారు. 

ముక్కలుగా నరికిన శరీర భాగాల నుంచి దుర్వాసన రాకుండా నిందితులు వాటికి పసుపు రాసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బయట పడేసే ముందు కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో కూడా పెట్టినట్లు ఘటనాస్థలి నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా గుర్తించారు. అయితే, ఈ హత్య ఎందుకు జరిగిందీ అన్నది ఇంకా వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News