Gold Rates: హైదరాబాద్ మార్కెట్లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Huge decrease in gold and silver rates in Hyderabad market
  • 10 గ్రాముల బంగారంపై రూ. 2,250 తగ్గుదల 
  • ప్రస్తుతం రూ. 74,400కు పడిపోయిన పసిడి ధర
  • రూ. 4 వేలు తగ్గి రూ. 92 వేలకు దిగొచ్చిన వెండి 
  • అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో భారీ క్షీణత

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు గత రాత్రి భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌లో సోమవారం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 76,750గా ఉండగా గత రాత్రి ఏకంగా రూ. 2,250 తగ్గి రూ. 74,400కు పడిపోయింది. పుత్తడి ధర ఇటీవల గరిష్ఠంగా రూ. 77,150 పలికింది. బంగారం ధరలతోపాటే ఊగిసలాడే వెండి ధరలు కూడా భారీగా క్షీణత నమోదు చేశాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 96 వేలు పలకగా, ఏకంగా రూ. 4 వేలు క్షీణించి రూ. 92 వేలకు దిగొచ్చింది. 

అమెరికాలో ఎన్నికలు ముగిసే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చన్న అంచనాలు ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి బంగారం, వెండి పెట్టుబడులు మందగించాయి. ఫలితంగా ఇటీవల జీవనకాల గరిష్ఠాన్ని చూసిన ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం 2423 డాలర్లుగా ఉన్న ఔన్సు ధర నిన్న 2340కి పడిపోయింది. ఇటీవల గరిష్ఠంగా 2449 డాలర్లకు కూడా చేరింది. 

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపైనా పడింది. ఈక్విటీ మార్కెట్లలోకి మదుపర్ల నిధులు ఇలానే కొనసాగితే 10 గ్రాముల పసిడి ధర రూ. 73 వేలకు, కిలో వెండి ధర రూ. 86 వేల స్థాయికి క్షీణించే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News