Justin Longer: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై జస్టిన్ లాంగర్‌ సంచలన వ్యాఖ్యలు

Indian cricket team head coach is almost a thousand times that of any IPL coach said Justin Longer
  • ఐపీఎల్‌‌ కోచ్‌‌తో పోల్చితే 1000 రెట్ల రాజకీయాలు, ఒత్తిడి ఉంటాయన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
  • కేఎల్ రాహుల్‌తో మాట్లాడగా ఈ విషయాలు చెప్పాడన్న లాంగర్
  • కోచ్ కోసం బీసీసీఐ అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌-2024తో టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్న వ్యక్తుల్లో ఒకరైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా హెడ్ కోచ్‌గా రాజకీయాలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలసటతో కూడిన బాధ్యత అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ తనతో చెప్పాడని లాంగర్ వివరించాడు. ఐపీఎల్-2024 సమయంలో ఈ మేరకు కేఎల్ రాహుల్‌తో తాను మాట్లాడానని లాంగర్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ కోచ్‌తో పోల్చితే టీమిండియా హెడ్‌ కోచ్‌‌‌గా 1000 రెట్ల కంటే ఎక్కువ రాజకీయాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ రాహుల్ చెప్పాడని పేర్కొన్నాడు.

కోచ్ పదవి అందరినీ ఆకట్టుకునే బాధ్యత అని, ఆస్ట్రేలియా జట్టుతో నాలుగేళ్లు పనిచేసి చాలా అలసిపోయానని లాంగర్ ప్రస్తావించాడు. ‘‘నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడాను. ఐపీఎల్ జట్టులో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయనుకుంటే.. దానికి వెయ్యి రెట్లు భారత్ కోచ్ పదవి అని రాహుల్ చెప్పాడు. ఇది మంచి సలహాగా నేను భావించాను’’ అని లాంగర్ పేర్కొన్నాడు. బీబీసీతో మాట్లాడుతూ లాంగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై పెద్దగా ఆసక్తి చూపించలేదన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News