cyclone remal: ఆదివారానికల్లా తీవ్ర తుపానుగా అల్పపీడనం.. రెమల్​ తుపానుగా నామకరణం!

cyclone remal to reach west bengal coasts by sunday
  • ప్రస్తుత సీజన్ లో రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న తొలి తుపాన్
  • పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే చాన్స్
  • సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు వాతావరణశాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోందని.. అది తీవ్ర తుపానుగా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుత సీజన్ కు సంబంధించి రుతుపవనాలకు ముందు ఏర్పడుతున్న మొట్టమొదటి తుపాన్ ఇదేనని అధికారులు తెలిపారు. హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుపానులకు పెట్టే పేర్ల క్రమంలో.. ప్రస్తుతం ఉన్న పేరు రెమల్. దీనిని ఈ తుపానుకు పెట్టనున్నట్టు వెల్లడించారు.

శనివారానికల్లా తుపానుగా మారి..
బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితిపై ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ మాట్లాడారు. ‘‘మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా వాయుగుండంగా మారుతుంది. తర్వాత మరింత బలపడి శనివారం ఉదయానికల్లా తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుంది. ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది..” అని ఆమె వెల్లడించారు.

సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
అల్పపీడనం తుపానుగా మారాక గంటకు 102 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.

పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు
ఈ తుపాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మిగతా తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంది.

కచ్చితంగా తీవ్ర తుపాను అని చెప్పేదెలా..?

  • బంగాళాఖాతంలోని ప్రస్తుత అల్పపీడనం కచ్చితంగా తీవ్ర తుపానుగా ఎందుకు మారుతుందన్న దానిపై ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్, కేంద్ర భూవైజ్ఞానిక శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పలు వివరాలు వెల్లడించారు. 
  • సాధారణంగా అల్పపీడనం ఏర్పడినప్పుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, అంతకన్నా ఎక్కువగా ఉంటే అది తుపానుగా మారుతుంది.
  • ప్రస్తుతం బంగాళాఖాతంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అంటే అల్పపీడనం అత్యంత సులువుగా, కచ్చితంగా తీవ్ర తుపానుగా మారుతుంది.

  • Loading...

More Telugu News