Maheshwar Reddy: మిల్లర్ల నుంచి ఉత్తమ్ రూ.216 చొప్పున డిమాండ్ చేసింది నిజం కాదా... చిట్టా విప్పుతా!: బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి

BJPLP Maheshwar Reddy targets Minister Uttam Kumar Reddy
  • 'యూ' ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి విమర్శలు
  • కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మహేశ్వర్ రెడ్డిపై కేసు
  • ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న మహేశ్వర్ రెడ్డి
  • ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్

రైస్ మిల్లర్ల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వింటాలుకు రూ.216 డిమాండ్ చేశారని... ఒక్కొక్క చిట్టా మొత్తం విప్పుతానని... తన వద్ద పూర్తి సమాచారం ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. 'యూ' ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఉత్తమ్‌పై యూ ట్యాక్స్ ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రిపై మహేశ్వర్ రెడ్డి అనుచిత ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ అంశంపై మహేశ్వర్ రెడ్డి గురువారం స్పందించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని... అందుకే ఆయన స్పందన కోసం నిన్నంతా ఎదురు చూశానన్నారు. తాను చెప్పింది వాస్తవాలు కాబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకుండా ముఖం చాటేశారన్నారు. ఏం చేయాలో తెలియక తనపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాల సహా నిరూపించేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. పౌరసరఫరాలో ఉన్న అవకతవకలను ఏ విధంగా సరిచేస్తారో చెప్పాలని నిలదీశారు. పోలీసు కేసులతో ఏదీ పరిష్కారం కాదని హితవు పలికారు.

ధాన్యం సేకరణకు సంబంధించి 25-01-24న ఇచ్చిన జీవోలో టెండర్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారని... అదేరోజు గ్లోబల్ టెండర్ పిలిచారన్నారు. గ్లోబల్ టెండర్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారని... అదేరోజు కొంతమంది మిల్లర్లను పిలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారో ఆధారాలతో బయటపెట్టమంటారా? అని ప్రశ్నించారు. క్వింటాలుకు రూ.216 ఇవ్వాలని రైస్ మిల్లర్లను డిమాండ్ చేసింది నిజం కాదా? అన్నారు. మీరు చేసిన వసూళ్ల అరాచకాన్ని బయటపెట్టమంటారా? అన్నారు.

క్వింటాల్‌కు రూ.216 చొప్పున 35 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.800 కోట్ల మేర వసూలు చేశారా? లేదా? చెప్పాలని నిలదీశారు. రెండు నెలలు అవుతున్నప్పటికీ ధాన్యాన్ని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో చెప్పాలన్నారు. లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని క్వింటాలుకు రూ.2,259కి కొనుగోలు చేసి... 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని క్వింటాలుకు రూ.5,700 పెట్టి కొనడం ఏమిటి? అన్నారు. ఇందులోని మతలబు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తమ్‌కు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. పోలీసు కేసులకు, లీగల్ యాక్షన్లకు తాను భయపడేది లేదన్నారు. తాను కాలేజీలను, కోట్ల ఆస్తులను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తినని అన్నారు.

  • Loading...

More Telugu News