Satya Nadella: సత్య నాదెళ్లకు రూ.2 లక్షల జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం

Satya Nadella has been fined Rs 27 lakh by the central government
  • కంపెనీల చట్టంలోని ముఖ్య ప్రయోజన యాజమాని (ఎస్‌బీవో) నిబంధనను ఉల్లంఘించిన లింక్డ్‌ఇన్ కంపెనీ
  • లింక్డ్‌ఇన్ యాజమాన్య కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న నాదెళ్లకు ఫైన్
  • సత్య నాదెళ్ల సహా ఎనిమిది మంది ఇతర అధికారులకి జరిమానా విధింపు
కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ (ఎస్‌బీవో) నిబంధనలను మైక్రోసాఫ్ట్ సారధ్యంలోని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ‘లింక్డ్‌ఇన్ ఇండియా’ ఉల్లంఘించింది. కంపెనీకి సంబంధించి ముఖ్య ప్రయోజన యాజమానిని (ఎస్‌బీవో) గుర్తించి కేంద్రానికి నివేదించడంలో కంపెనీ విఫలమైంది. చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా, కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల సహా లింక్డ్‌ఇన్‌లో పనిచేస్తున్న 8 మంది అధికారులకు కేంద్రం జరిమానా విధించింది. సత్య నాదెళ్ల సహా అందరికీ రూ.2 లక్షలు చొప్పున జరిమానా విధించింది. లింక్డ్‌ఇన్ కంపెనీకి రూ.7 లక్షలు పెనాల్టీ సహా మొత్తం రూ.27,10,800 మొత్తం జరిమానాగా విధించినట్టు పేర్కొంది.

ఈ జాబితాలో సత్య నాదెళ్ల, లింక్డ్‌ఇన్ కార్పొరేషన్‌ గ్లోబల్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్‌ సహా ఇతర అధికారులు ఉన్నారు. లింక్డ్‌ఇన్ సీఈవోగా ర్యాన్ రోస్లాన్స్‌ జూన్ 1, 2020న నియమితులయ్యారని, అప్పటి నుంచి సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయడం ప్రారంభించారని, కానీ ఎస్‌బీఓ నిబంధనల విషయంలో విఫలమయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను అందించాలని లింక్డ్‌ఇన్‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది. 

కాగా కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం కంపెనీల గణనీయ ప్రయోజన యజమాని (ఎస్‌బీవో) సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో లింక్డ్‌ఇన్ అధికారులు విఫలమయ్యారు. దీంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి జరిమానా విధించింది. కాగా డిసెంబర్ 2016లో లింక్డ్‌ఇన్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
Satya Nadella
Central Government
LinkedIn
Microsoft

More Telugu News