Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల్లో 1644 మంది నేరచరితులు

1644 candidates contesting in Lok Sabha elections have criminal cases registered against them
  • 1,188 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయన్న ఏడీఆర్ రిపోర్ట్
  • పలువురిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు
  • 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికలు-2024లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 1,644 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నివేదిక పేర్కొంది. 1,188 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను పరిశీలించినట్టు ఏడీఆర్ తెలిపింది.

లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,618 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇందులో 161 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇక రెండవ దశలో మొత్తం 1,192 మంది అభ్యర్థులు పోటీ పడగా 250 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని తెలిపింది. ఇందులో 167 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.

లోక్‌సభ మూడవ దశ ఎన్నికల్లో 1,352 మంది అభ్యర్థులు పోటీ చేయగా 244 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 172 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన నాలుగవ దశలో అత్యధికంగా 1,710 మంది అభ్యర్థులు పోటీ పడగా అందులో 360 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 274 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. 

ఇక ఐదవ దశలో 695 మంది అభ్యర్థులు పోటీ పడగా 159 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 122 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. 6వ దశలో పోటీ పడే 866 మంది అభ్యర్థుల డేటాను విశ్లేషించగా 180 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా గుర్తించామని ఏడీఆర్ డేటా పేర్కొంది. వారిలో 141 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని పేర్కొంది. చివరిదైన 7వ దశలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 199 మందిపై కేసులు ఉన్నాయి. వారిలో 151 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. కాగా మే 25న 6వ దశ, జూన్ 1న తుది దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News