Royal Challengers Bengaluru: ఆర్సీబీపై రాజస్థాన్ ఉత్కంఠ భరిత విజయం.. సన్‌రైజర్స్‌తో అమీతుమీ

Rajasthan Royals win in Eliminator against Royal Challengers Bengalore In IPl 2024 Eliminator Match
  • 4 వికెట్ల తేడాతో గెలిచిన సంజూ శాంసన్ సేన
  • క్వాలిఫయర్-2కి అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్
  • మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆశాభంగం

మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కలచెదిరింది. సంచలన రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్‌తో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. 

45 పరుగులు సాధించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లలో టామ్ కోహ్లెర్ 20, సంజూ శాంసన్ 17, రియాన్ పరాగ్ 36, ధ్రువ్ జురెల్ 8, హెట్మేయర్ 26, పావెల్ 16 (నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. దీంతో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయారు. ఒక దశలో రాజస్థాన్ కీలకమైన వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందేమో అనిపించింది. కానీ అలా జరగలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన రాజస్థాన్ విజేతగా నిలిచింది.

ఇక బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు పడ్డాయి. లూకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.

ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (34), విరాట్ కోహ్లీ (33), లామ్రోర్ (32) కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లలో డుప్లెసిస్ 17, మ్యాక్స్‌వెల్ 0, దినేశ్ కార్తీక్ 11, స్వప్నిల్ సింగ్ 9 (నాటౌట్), కర్ణ్ శర్మ 5 చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్-2, బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీశారు.

కాగా క్వాలిఫయర్-2 అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గురువారం చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News