పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగొస్తుండగా కబళించిన మృత్యువు!
- అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి
- కారుడ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు
- ఈ నెల 27న జరగాల్సిన పెళ్లి.. అంతలోనే కుటుంబంలో పెను విషాదం
ఘటనస్థలిలోనే ముగ్గురు దుర్మరణం పాలవగా గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. మృతులను అనంతపురంలోని రాణినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అనంతపురంలోని రాణినగర్ లో నివసించే షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో పెళ్లి బట్టల షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వస్తుండగా గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్. సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.