Kurkure: భర్త 5 రూపాయల కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య

 Woman seeks separation after husband forgets to bring Kurkure packet
  • ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
  • రోజూ కుర్‌కురే తినడాన్ని అలవాటుగా మార్చుకున్న మహిళ
  • రోజూ ఓ ప్యాకెట్ ఇచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసిన భర్త
  • ఒక రోజు మర్చిపోవడంతో సీన్ మొత్తం రివర్స్

ఆమెకు కుర్‌కురే అంటే ప్రాణం. రోజూ వాటిని తిని తీరాల్సిందే. భర్త కూడా రోజూ రూ. 5 కుర్‌కురే ప్యాకెట్ తెచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసేవాడు. ఒకరోజు కుర్‌కురే తీసుకురాకుండా చేతులూపుకొంటూ వచ్చిన భర్తను చూసి అలిగి పుట్టింటికి వెళ్లిన ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కుర్‌కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన. వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఆమెకు రోజూ కుర్‌కురే తినడం అలవాటు. కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డుచెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. అయితే, జంక్‌ఫుడ్ రోజూ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అది ఇరువురి మధ్య గొడవకు కారణమైంది. అయినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చే భర్త.. ఒకరోజు మర్చిపోయాడు. అంతే, అపరకాళిలా అతడిపై విరుచుకుపడిన ఆమె, ఆపై పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల ఇలా చిన్నచిన్న కారణాలతో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లయి 18 నెలలు అయినా భర్త తనతో తగదా పెట్టుకోవడం లేదని, అతడి మంచితనాన్ని తాను భరించలేకపోతున్నానంటూ యూపీ మహిళ కోర్టుకెక్కడం సంచలనమైంది.

  • Loading...

More Telugu News