Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విడాకులు తీసుకున్న కూతురికి మేళ‌తాళాల‌తో స్వాగ‌తం.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Kanpur Father Grandly Welcome his Divorced Daughter Video goes Viral
Advertisement
  •  కాన్పూర్ లోని ఉర్వి అనే మ‌హిళ‌కు ఎనిమిదేళ్ల కిందట ఆశిష్ రంజ‌న్ తో వివాహం
  • కొన్ని రోజులకు అద‌నపు క‌ట్నం కోసం అత్తింట‌ వేధింపులు
  • కూతురు పుట్టిన త‌ర్వాత నుంచి ఇంకా పెరిగిన వేధింపుల‌ను తాళ‌లేక విడాకులు తీసుకున్న ఉర్వి
  • దాంతో అత్తవారి ఇంటి నుంచి మేళతాళాలతో కూతురు, మ‌న‌వ‌రాలిని ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చిన పేరెంట్స్
Advertisement
భ‌ర్త వేధింపులు తాళ‌లేక విడాకులు తీసుకున్న కూతురికి పేరెంట్స్ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జ‌రిగింది. ఉర్వి అనే మ‌హిళ‌కు ఎనిమిదేళ్ల కిందట ఆశిష్ రంజ‌న్ అనే వ్య‌క్తితో పెళ్ల‌యింది. ఆమెకు కూతురు పుట్టిన‌ప్ప‌టి నుంచి అత్తవారి ఇంట్లో వేధింపులు మొద‌ల‌య్యాయి. ఆ వేధింపులు తారస్థాయికి చేర‌డంతో చేసేదేమీలేక విడాకులు తీసుకుంది. అండ‌గా నిలిచిన ఉర్వి త‌ల్లిదండ్రులు ఆమెను మేళ‌తాళాల‌తో స్వాగ‌తం ప‌లికి ఇంటికి తీసుకొచ్చారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న కుమార్తె ఉర్విని తండ్రి అనిల్‌కుమార్‌ 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ఆశిష్ రంజ‌న్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజులు ఉర్విని అత్తింటివాళ్లు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత అద‌న‌పు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇక ఉర్వికి కూతురు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. 

గత ఎనిమిదేళ్లుగా వాళ్లలో ఎలాంటి మార్పు రాకపోగా వేధింపులు అంతకంతకు పెరిగిపోయాయి. దాంతో ఆమె వారి వేధింపులు తాళ‌లేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. గత ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దాంతో ఉర్వి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు.

"మేము మా కూతురిని పెళ్లిచేసి అత్తారింటికి ఎలా పంపించామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. విడాకులతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈవిధంగా చేశాం" అని అనిల్ కుమార్ చెప్పారు. కాగా, తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొన్నారు. 

అలాగే ఉర్వి త‌ల్లి కుసుమ‌ల‌త కూడా ఈ సంద‌ర్భంగా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న కూతురు, మ‌న‌వ‌రాలితో క‌లిసి ఉండేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ఇది గొప్ప అనుభూతిగా ఆమె పేర్కొన్నారు. ఇక ఉర్విని ఆమె తండ్రి మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. కష్ట సమయంలో కుమార్తెకు తోడుగా నిలిచిన ఆ తండ్రిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. గతంలోనూ ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాల‌తో పుట్టింటికి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.
Advertisement
Advertisement
Uttar Pradesh
Kanpur
Divorce
Viral Videos
Social Media

More Telugu News