ఢిల్లీలో ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్న సునీతా కేజ్రీవాల్
- తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- ఈ వారాంతంలో ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్న సునీత
- నాలుగు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుల్దీప్ కుమార్‌కు మద్దతుగా కొండ్లిలో ఈ వారాంతంలో సునీతా కేజ్రీవాల్ మొదటి రోడ్డు షో నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న ఇతర లోక్ సభ స్థానాల్లో కూడా ఆమె ర్యాలీలు నిర్వహించనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు, కాంగ్రెస్ మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ; నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి.
సునీతా కేజ్రీవాల్ ఢిల్లీతో పాటు గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు. గుజరాత్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.