Superstar Krishna: ఏపీ రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ పేరును లాగడంపై నరేశ్ స్పందన

  • ఇటీవల తన ప్రసంగంలో సూపర్ స్టార్ కృష్ణను ప్రస్తావించిన పవన్
  • కృష్ణ ఎన్ని విమర్శలు చేసినా ఎన్టీఆర్ పల్లెత్తు మాట అనలేదని వెల్లడి
  • పవన్ వ్యాఖ్యలపై దుమారం
  • పవన్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్న నరేశ్
  • భవిష్యత్తులో ఎవరూ కృష్ణ గారి గురించి మాట్లాడొద్దని విజ్ఞప్తి
Naresh reacts on Superstar Krishna name being dragged into AP politics

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల సభలో మాట్లాడుతూ... అప్పట్లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో ఉండేవారని, ఎన్టీఆర్ ను కృష్ణ విమర్శించినా... ఎన్టీఆర్ ఎప్పుడూ కృష్ణను పల్లెత్తు మాట అనలేదని అన్నారు. ఇప్పటి రాజకీయ నేతలు ఎలా ఉన్నారో చెప్పేందుకు పవన్ ఆ పోలిక తెచ్చారు. 

అయితే కృష్ణ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడేందుకు కృష్ణ గారిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ విమర్శలు వచ్చాయి. ఇది వివాదం రూపుదాల్చుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు. 

కృష్ణ గారి గురించి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దని సవినయంగా కోరుతున్నట్టు తెలిపారు. "పవన్ కల్యాణ్ గారు తన ప్రసంగంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారిని విమర్శించడం దిగ్భ్రాంతికి గురి చేసింది... చాలా బాధపడ్డాను. కృష్ణ గారి మనసు బంగారం. పార్లమెంటు సభ్యుడిగా నైతిక విలువలకు పెద్దపీట వేసిన వ్యక్తి ఆయన. సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఆయన అందించిన సేవలు నిత్యనూతనం. ఆయన ఏనాడూ పార్టీ మారింది లేదు, తన ప్రసంగాల్లో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించింది లేదు" అని నరేశ్ ట్వీట్ చేశారు. 

ఓ నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్ పట్ల నాకెంతో గౌరవం ఉంది.... నేను ఆయనలో ఏపీ భవిష్యత్ ను చూస్తున్నాను అని నరేశ్ మరో ట్వీట్ లో వెల్లడించారు. ఏపీకి పునర్ వైభవం కల్పించేందుకు ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించాలని బీజేపీ మాజీ యువజన అధ్యక్షుడిగా, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

More Telugu News