Nara Lokesh: జగన్ జీవితంలో మళ్లీ సీఎం కాలేడన్న భరోసా వస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి: నారా లోకేశ్

  • ఏలూరులో  ప్రజాగళం సభ
  • గజదొంగ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్న నారా లోకేశ్
  • ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో... ఈ లోకేశ్ తగ్గేదే లేదు అంటూ సవాల్
  • చంద్రబాబు సీఎం అయిన వంద రోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ ధీమా
Nara Lokesh attends Yuvagalam meeting in Eluru

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏలూరులో క్రాంతి కల్యాణమండపం వద్ద నిర్వహించిన యువగళం సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు గోపి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ... మన ఇంట్లో దొంగలుపడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం... రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 420 ఉన్నారు, ఆయన ఆస్తులకన్నా కేసుల లిస్టు పెద్దది, రాబోయే ఎన్నికల్లో అందరం కలసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 

నెలరోజుల్లో రాష్ట్రం నుంచి శని పోతోంది, ప్రజా ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ఇప్పుడు ఏ నోట విన్నా జరుగు జగన్ జరుగు, ఖాళీ చేయి కుర్చీ అనే నినాదమే విన్పిస్తోందని తెలిపారు. 

ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయ దుందుభి మోగిస్తోందన్న వార్తలతోనే రౌడీలు, గూండాలు, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు రాష్ట్రం వదిలి పారిపోతారని తెలిపారు. అయితే ఎక్కడికి వెళ్లినా వారిని వదిలిపెట్టేది లేదని, భూమండలంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు. 

అది ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే!

జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే. భూములు కొట్టేసేందుకే ఈ నల్లచట్టం. రూపాయి రూపాయి కూడబెట్టి తాత,తండ్రులు వారసులకు భూములిస్తే జగన్ ఫోటోలు వేసుకోవడమేమిటి? సర్వేరాళ్లపై కూడా ఫోటోలే. 

ఈ యాక్ట్ ప్రకారం ఒరిజినల్స్ తమ వద్ద ఉంచుకొని ప్రజలకు జిరాక్స్ ఇస్తారట. భూమి ఎవరిదో అధికారులే నిర్ణయిస్తారట. భూకబ్జాలతో గత అయిదేళ్లుగా జనాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశాం. అటువంటి వాటిని చట్టబద్ధం చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 

ముఖ్యమంత్రిగా జగన్ ఘోరంగా ఫెయిల్!

జగన్ స్కూలులోనే ఫెయిల్, కాలేజీలో ఫెయిల్, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్. అడుగడుగునా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. బడుగు, బలహీనవర్గాలపై యథేచ్చగా దాడులు చేస్తున్నారు. జగన్ సర్కారు నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ ప్రభుత్వం. 

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడానికి గంజాయి ప్రధాన కారణం. దిశచట్టం లేకుండా పోలీస్ స్టేషన్లు పెట్టారు. లేని చట్టం కారణంగా మహిళలను వేధించే సైకోలకు వెంటనే బెయిల్ వస్తోంది. 

ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రానికి తీరనినష్టం

గత ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరుతో ఎంత నష్టపోయాం, రాజధాని లేదు, పోలవరం నాశనమైంది, పెట్టుబడులు, ఉద్యోగాలు పోయాయి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. 

గతంలో 10 ఓట్ల తేడాతో రాష్ట్రంలో ఓ ఎంపీ అభ్యర్థి ఓడారు. మంగళగిరిలో 2014లో 12 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఓడారు. యువత ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి వచ్చి ఓటు వినియోగించుకోండి. గత అయిదేళ్లుగా రాష్ట్ర యువత చాలా నష్టపోయారు.

జీవితంలో జగన్ సీఎం కాడని భరోసా వస్తేనే పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు వరదలా వస్తాయి. 

సింగిల్ సింహం మట్టికరవడం ఖాయం!

ముఖ్యమంత్రి జగన్ సింహం సింగిల్ అంటున్నాడు. సింహం ఎక్కడైనా పరదాలు కట్టుకుని వస్తుందా? వేటాడేందుకు రెండు సింహాలు వచ్చాయి, ఒకటి చంద్రబాబు, రెండు పవనన్న. జగన్ నీ టైమ్ అయిపోయింది. మే 13న రెండు సింహాల మధ్య నువ్వు మట్టి కరవడం ఖాయం. 

ఎన్నికలప్పుడు జగన్ రెండు డ్రామాలు రక్తి కట్టిస్తారు. మొదటిది శవరాజకీయాలు, రెండోది సానుభూతి. 2014లో తండ్రి శవాన్ని వాడారు. 2019లో బాబాయి శవాన్ని వాడారు. ఇటీవల పెన్షన్లు ఇవ్వకుండా 32 మంది వృద్ధులను చంపి ఆ శవాలతో రాజకీయం చేయాలని చూశారు. 

ఇటీవల జగన్ పై స్పెషల్ గులకరాయి పడింది. ఆ రాయి సీఎంకు తగిలి, తర్వాత వెల్లంపల్లి రెండు కళ్లకు తగిలిందట. గులకరాయి కూడా కోడికత్తిలాంటిదే. సీఎం బస్సు యాత్ర చేసేటప్పుడు తొలిరోజు చిన్నగా ఉన్న బ్యాండేజి శ్రీకాకుళం వెళ్లాక పెద్దదైంది. కనీసం అక్కడ మరక కూడా లేదు. 

జగన్ సినిమాల్లోకి వెళ్లి ఉంటే బ్రహ్మానందంకు పోటీ ఎదురయ్యేది.  గతంలో కోడికత్తి తర్వాత బాబాయ్ శవం లేచింది. ఇప్పుడు ఎవరి శవం లేస్తుందో అని నా భయం!

బడేటి చంటి, మహేష్ యాదవ్ లను గెలిపించండి!

గత ప్రభుత్వ హయాంలో రూ.1200 కోట్లతో బడేటి బుజ్జి ఏలూరును అభివృద్ధి చేశారు. ఆనాడు బడేటి బుజ్జి ఏ ఆశయాలతో అభివృద్ధిచేశారో అదే ఆశయాలను బడేటి చంటి ముందుకు తీసుకెళతారు. ప్రజల గురించి అహర్నిశలు ఆలోచించే వ్యక్తి చంటి. ఈసారి ప్రతి ఓటు కీలకమైనది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవనన్న చెప్పిన మాటను అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఏలూరులో భూకబ్జాదారులు, గంజాయి బ్యాచ్ ల భరతం పట్టాలంటే చంటిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలి. 

కేంద్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి చేసేందుకు ఎంపీ అభ్యర్థి మహేశ్ యాదవ్ ను గెలిపించాలి. ఆయన ఎంపీ అయితే నిధులు, పెట్టుబడులు తెస్తారు.

  • Loading...

More Telugu News