Mallikarjun Kharge: శామ్ పిట్రోడా 'వారసత్వ సంపద' వ్యాఖ్యలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే

  • అమెరికాలో వారసత్వ పన్ను ఉందని... అది తనకు న్యాయంగా అనిపించిందన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా
  • శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం
  • పిట్రోడా వ్యాఖ్యలపై పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ
  • శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తమపై ఎందుకు రుద్దుతున్నారని ఖర్గే ప్రశ్న
Kharge on Sam Pitroda 50 percent wealth tax idea

అమెరికాలో వారసత్వ సంపదపై పన్ను ఉందని... అది తనకు న్యాయంగా అనిపించిందన్న కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు చేయడంతో ఖర్గే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నతువంటి ఉద్దేశ్యాలు తమకు లేవన్నారు. అయినా శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తమపై ఎందుకు రుద్దుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని మరో నేత జైరాం రమేశ్ అన్నారు.

అసలేం జరిగింది?

ఇటీవల శామ్ పిట్రోడా మాట్లాడుతూ... అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, దాని ప్రకారం ఒక వ్యక్తి వద్ద 100 మిలియన్ డాలర్ల విలువైన సొత్తు ఉంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అందులో దాదాపు 45 శాతమే వారసులకు బదిలీ అవుతుందని... మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఇదొక ఆసక్తికరమైన అంశమని... అంటే సంపదను సృష్టించి వెళ్లిపోతున్న వారు ప్రజల కోసం దానిని వదిలేయాలన్నారు. అయినా వదిలేయాల్సింది మొత్తమేమీ కాదు... సగమే... ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా? అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యాపారవేత్త 55 శాతం సంపదకు, ఒక రైతు 55 శాతం సొత్తుకు చాలా తేడా ఉంటుందని పేర్కొంది. గాంధీలు తమ పిల్లలు, అల్లుడి కోసం భారీ ఖజానాను నిర్మించారని... కానీ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును వారు లాక్కోవాలనుకుంటున్నారని విమర్శించింది. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.

More Telugu News