American Citizenship: అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో రెండో స్థానంలో భారతీయులు!

Nearly 66000 Indians Got American Citizenship In 2022
  • 2022లో 65,960 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
  • మరో 128,878 మంది మెక్సికన్లకు అమెరికా పౌరసత్వం
  • విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య 2,831,330
భారతీయులు భారీ స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో మెక్సికో ప్రజలు ఉన్నారు. అమెరికా సెన్సస్ బ్యూరో తాజా గణాంకాల ప్రకారం, 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తరువాత స్థానాల్లో ఫిలిప్పీన్స్, క్యూబా, డోమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనీయులు ఉన్నారు. 

సెస్సస్ బ్యూరో ప్రకారం, 2022లో అమెరికాలో ఉంటున్న మొత్తం విదేశీయుల సంఖ్య 46 మిలియన్లు. దేశ జనాభాలో వీరి సంఖ్య 14 శాతం. అమెరికాలోని విదేశీయుల్లో దాదాపు 53 శాతం మంది తమకు అమెరికా పౌరసత్వం ఉన్నట్టు తెలిపారు. ఇక 2022లో మొత్తం 969,380 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 

ఇక 2023 లెక్కల ప్రకారం, విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330. అమెరికా పౌరసత్వం ఉన్న విదేశీయుల్లో మెక్సికన్లు (1,06,38,429 మంది) తొలిస్థానంలో నిలవగా భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అయితే, విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారిలో 42 శాతం మందికి అమెరికా పౌరులయ్యే అర్హత లేదని ఈ నివేదికలో తేలింది. ఇక గ్రీన్ కార్డు ఉన్న 2,90,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉందని ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. 

అమెరికా వీసా, గ్రీన్ కార్డు, పౌరసత్వానికి సంబంధించిన బ్యాక్‌లాగ్‌ల గురించి కూడా పలు వివరాలు వెల్లడయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 8,23,702 మంది పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,08,000 పౌరసత్వ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువ.
American Citizenship
Indians In America
Mexico
USA

More Telugu News