Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు

Hyderabad BJP candidate Madhavi Latha booked for hurting religious sentiments
  • శ్రీరామనవమి ఊరేగింపులో మసీదు వైపు బాణం వదులుతున్నట్టు ఊహాజనిత సంకేతమిచ్చిన బీజేపీ అభ్యర్థి
  • ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు
  • బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీ లతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. దీంతో ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

 కాగా మసీదు వైపు బాణం వేస్తున్నట్టుగా మాధవీ లత ఇచ్చిన ఊహాజనిత సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ విమర్శలపై మాధవీ లత స్పందిస్తూ.. వీడియో అసంపూర్తిగా ఉందన్నారు. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా ఆమె అన్నారు.
Madhavi Latha
BJP
Hyderabad
Case
Lok Sabha Polls

More Telugu News