నల్గొండ రోడ్డు ప్రమాదం... సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు
- బుధవారం సాయంత్రం నెల్లూరు వెళుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తను ఢీకొన్న రఘుబాబు కారు
- ఘటనాస్థలంలోనే మృతి చెందిన సందినేని జనార్ధన్ రావు
- ప్రమాదస్థలంలో అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేసిన పోలీసులు
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడంతో బెయిల్ పొందిన రఘుబాబు
రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(49)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వెంటనే సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.