Harish Rao: బీజేపీకి చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు... ఆ పార్టీ నాయకులతో జాగ్రత్త: హరీశ్ రావు

  • రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్.. ఇలా ఎన్నో పథకాలు బీఆర్ఎస్ అమలు చేసిందన్న హరీశ్ రావు
  • గెలిచినా... ఓడినా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతున్నామన్న సిద్దిపేట ఎమ్మెల్యే
  • తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదని విమర్శ
Harish Rao fires at BJP

బీజేపీ వారికి చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు, కేంద్రంలో బీజేపీ పదేళ్లు ఉన్నాయని... మనం చెప్పుకోవడానికి రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి... ఇలా వందలు ఉన్నాయన్నారు. కానీ బీజేపీ వారి వద్ద ఏమీ లేవని విమర్శించారు. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ వాళ్లు ఎలాంటి పథకాలు అమలు చేయలేదు కాబట్టి చిత్ర‌ప‌టాలు, క్యాలెండ‌ర్లు, బ్యాగులు, చీర‌లు పంచుతున్నారని విమర్శించారు. గెలిచినా... ఓడినా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

ఓడిపోతే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమ‌లుకు పోరాడుతున్నామన్నారు. తాము ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటామని... ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని సూచించారు. ఈ పదేళ్లలో బీజేపీ చేసింది పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచడమేనని విమర్శించారు. గ్యాస్ ధర రూ.1000కి పెంచారని... కానీ ఎన్నికలు వచ్చాయని రూ.100 తగ్గించినట్లు చెప్పారు. బీజేపీ అలా చేస్తే మనం అమాయకులమా? చెవిలో పువ్వులు పెట్టుకున్నామా? అని ధ్వజమెత్తారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు.

తెలంగాణకు వారు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారని, కానీ తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల‌కు 157 న‌ర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణ‌కు మొండిచేయి చూపించారన్నారు. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయ హోదా ఇవ్వ‌కుండా మోసం చేసింది బీజేపీయే అన్నారు. గ‌త లోక్ సభ ఎన్నిక‌ల్లో మోదీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వ‌చ్చి పాల‌మూరు-రంగారెడ్డి పూర్తి చేస్తామ‌ని చెప్పారని... కానీ క‌నీసం అనుమ‌తి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకులు మాయమాటలతో మనల్ని మోసం చేయాలని చూస్తున్నారని... జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

More Telugu News