దాడి జరిగింది సీఎం జగన్ మీద... మీకెందుకంత తాపత్రయం?: విపక్షాలపై సజ్జల ఫైర్
- సీఎం జగన్ పై రాయి దాడి
- డ్రామా అంటున్న విపక్షాలు
- సీఎం జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి విపక్షాలు భయపడుతున్నాయన్న సజ్జల
"దాడి జరిగింది మీ మీద కాదు. చంద్రబాబు మీదో, పవన్ కల్యాణ్ మీదో... ఇతర విపక్ష నేతల మీదో కాదు. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి, శాసనసభ్యుడు వెల్లంపల్లికి కూడా గాయమైంది.
ఈ ఘటనలో మేం బాధితులం. దీని గురించి మొదట మాట్లాడే హక్కు మాకు ఉంటుంది. దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. మరి విపక్షాలకు ఎందుకంత తాపత్రయమో అర్థం కావడంలేదు. ఇందులో ఏం వైఫల్యం ఉందో చెప్పడానికి మీరెవరు? నింద మీ మీదకు వస్తుందని తెలుగుదేశం పార్టీకి భయం.
రాయి విసిరిన దానిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సహజంగానే అనుమానం టీడీపీకి పైకి మళ్లుతుంది... అదే మేం వ్యక్తీకరించాం. మేం దాడి చేయలేదు అని వివరణ ఇచ్చుకోండి... అంతే తప్ప ఇదంతా డ్రామా అనడం, సీబీఐ విచారించాలి అనడం చూస్తుంటే టీడీపీ భయపడుతున్నట్టు అర్థమవుతోంది" అని సజ్జల వ్యాఖ్యానించారు.