Iran Drone Attack: ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్!

  • శనివారం ఏకంగా 200 కిల్లర్ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించిన ఇరాన్
  • అధిక శాతం డ్రోన్లను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామన్న ఇజ్రాయెల్
  • వివాదం ఇక్కడితో ముగిసిందని తాము భావిస్తున్నట్టు ఇరాన్ ప్రకటన
  • దాడిని ముక్తకంఠంతో ఖండించిన పాశ్చాత్య దేశాలు
  • ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నామని అమెరికా ప్రకటన
Iran drone attack on israel

సిరియాలో ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా వేడెక్కిన మధ్యప్రాచ్య పరిస్థితులు తాజాగా కీలకమలుపు తిరిగాయి. ఇజ్రాయెల్‌పై ప్రతికారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది. 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులకు దిగింది. మరోవైపు, ఇరాన్ వైపున్న వర్గాలు కూడా ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి.  అయితే, తాము స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు తాము భావిస్తున్నామని తెలిపింది. 

‘‘ఇరాన్ మొత్తం 200 కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లను తమపై ప్రయోగించింది’’ అని ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, చాలా మటుకు డ్రోన్లు, మిసైళ్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని తెలిపారు. అన్ని వైపులా సైనికులను మోహరించామని, ఇజ్రాయెల్ రక్షణ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్పష్ట ప్రకటన చేశారు. అంతకుమునుపు, భద్రత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్ వైపు వస్తున్న డ్రోన్లను కూల్చివేస్తున్నట్టు అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్వీరక్షణకు అన్నిరకాల సాయాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు. ఆత్మరక్షణతో పాటూ అవసరమైతే ప్రతిదాడులకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని ఈ సందర్భంగా బైడెన్‌కు తెలిపారు. ఇలాంటి పరిస్థితి కోసం కొన్నేళ్లుగా తాము ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

ఇరాన్ దాడిని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో, డెన్మార్క్, నార్వే తదితర దేశాలు ఖండించాయి. పరిస్థితిపై సమీక్షించేందకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 
 
ప్రస్తుతం ఏడో నెలకు చేరుకున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. మధ్యప్రాచ్య దేశాలన్నిటినీ ఇజ్రాయెల్‌తో ఘర్షణవైపుగా నడిపిస్తోంది. సుదూరాన ఉన్న లెబనాన్, సిరియాలో కూడా ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. యెమన్, ఇరాక్ నుంచి కూడా మిసైల్ దాడులు మొదలయ్యాయి. ఈ ఘర్షణలు చివరకు ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్, దాని మిత్రదేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయొచ్చన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

More Telugu News