Telangana: వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలి: తెలంగాణ సీఎస్ ఆదేశాలు

TG CS review on drinking water and paddy purchasing centres
  • నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు కలెక్టర్లకు అభినందన
  • వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు వెల్లడి
  • మన ఊరు మన బడి పనులు చేపట్టేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని వెల్లడి
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పిన సీఎస్
వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆమె బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తాగునీరు, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వేసవి చర్యలపై ఆమె సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు కలెక్టర్లను అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ప్రతిరోజూ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

మన ఊరు మన బడి పనులు చేపట్టేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. వడగాలుల తీవ్రతపై ప్రజలకు, సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరా ఉండేలా తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను తెలంగాణవ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పాఠశాలల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పనులు ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం నుంచి అవసరమైన అనుమతులు రావడంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణలో నెలకొన్న వేడిగాలులపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
Telangana
Lok Sabha Polls

More Telugu News