ఫోన్ ట్యాపింగ్ కేసు: రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనూ వార్ రూమ్ ఏర్పాటు?
- ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న షాకింగ్ అంశాలు
- ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు
- రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులపై నిఘా కోసం గెస్ట్ హౌస్
- జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు
రాధాకిషన్ రావు పోలీసు కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ఓటుకు నోటు వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ఎమ్మెల్యేలకు ఎర అంశం వెలుగు చూశాయి. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగమైనట్లుగా గుర్తించారు. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్ నెంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. కానీ 2018 నుంచి వీరి పంథా మారినట్లుగా రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతో పాటు సోషల్ మీడియా ట్యాపింగ్ పైనా దృష్టి సారించారు.