marathon: ఆఫ్రికా ఖండాన్ని చుట్టేసిన 'పరుగు'ల వీరుడు!

British Man Nears Milestone Of Becoming First To Run Entire Length of Africa
  • 15 వేల కిలోమీటర్ల మారథాన్ చేసిన బ్రిటన్ వాసి
  • 16 దేశాల మీదుగా 347 రోజులపాటు నాన్ స్టాప్ రన్నింగ్
  • ఆపన్నులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగు
మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెం అని మనకు తెలుసు.. అంత దూరం పరుగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్.. అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ వేల కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరుగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా అని నోరెళ్లబెడుతున్నారా? అయితే అది సాధ్యమేనని బ్రిటన్ కు చెందిన అల్ర్టా మారథాన్ పరుగుల వీరుడు రసెల్ కుక్ నిరూపిస్తున్నాడు. ఆ వివరాలు.. 

ఆశయం కోసం పరుగు..
రసెల్ కుక్ అరుదైన మైలురాయిని అధిగమించనున్నాడు. ఆఫ్రికా ఖండంలో అంతటా పరుగు తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రాజెక్టు ఆఫ్రికా పేరుతో అతను ఈ అనితర సాధ్యమైన పరుగును 2023 ఏప్రిల్ 22న దక్షిణాఫ్రికా దక్షిణ అంచున ప్రారంభించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 7న టునీసియాలోని  బిజరెట్ వద్ద ఫినిష్ లైన్ దాటనున్నాడు. మొత్తంగా 16 ఆఫ్రికా దేశాల మీదుగా 9 వేల మైళ్ల (సుమారు 15 వేల కిలోమీటర్లు) పరుగును అతను పూర్తి చేయనున్నాడు. ఇంత కఠోరమైన  పరుగు వెనక ఆపన్నులను ఆదుకోవాలన్న కోరిక కుక్ మదిలో బలంగా నాటుకుపోయింది. ద రన్నింగ్ చారిటీ పేరుతో అతను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.  ఇప్పటివరకు కుక్ సుమారు రూ. 4.47 కోట్లను విరాళాల రూపంలో సేకరించాడు. ఈ పరుగు వెనక స్నేహితుడి స్ఫూర్తి ఉందని కుక్ చెబుతున్నాడు. 

240 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకున్నా..
బీబీసీ కథనం ప్రకారం కుక్ వాస్తవానికి 360 మారథాన్లను 240 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాడు. అయితే వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భౌగోళిక అంశాలు, ఓ దారిదోపిడీ ఉదంతం కారణంగా అతని ప్రయాణం ఆలస్యమైంది. తన పరుగు మార్గంలో కుక్ ఎడారులు,  వర్షారణ్యాలు, పర్వతాల మీదుగా ముందుకు సాగిపోయాడు.

స్వాగతం పలకనున్న మ్యూజిక్ బ్యాండ్
 వచ్చే 5 రోజుల్లో తన పరుగును పూర్తి చేయనున్నట్లు కుక్ తాజాగా ట్వీట్ చేశాడు. “మరో 5 రోజులు మిగిలి ఉంది. గత 347 రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. అయినప్పటికీ ఈ ప్రయాణం నాకెంతో గౌరవమైనది” అని కుక్ పేర్కొన్నాడు. గతంలోనూ అతను ఆసియా ఖండాన్ని చుట్టివచ్చాడు. అలాగే ఓసారి బీర్ మారథాన్లోనూ పాల్గొన్నాడు. కుక్ ఫినిష్ లైన్ వద్దకు చేరుకోగానే అతనికి స్వాగతం పలికేందుకు ఓ మ్యూజిక్ బ్యాండ్ బృందం  ఎదురుచూస్తోంది.
marathon
africa
british man
offbeat

More Telugu News