Euthanasia: చికిత్స లేని మానసిక వ్యాధి.. కారుణ్య మరణాన్ని ఎంచుకున్న డచ్ యువతి

Dutch Woman Chooses Euthanasia Due To Untreatable Mental Health Struggles
  • చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్‌లాండ్స్ యువతి జొరాయా
  • బాధ నుంచి బయటపడేందుకు కారుణ్య మరణాన్ని ఎంచుకున్న వైనం
  • లోకాన్ని శాశ్వతంగా వీడేందుకు మే నెలలో తేదీ ఖరారు
  • కారుణ్య మరణానికి  2001లో చట్టబద్ధత కల్పించిన నెదర్‌లాండ్స్
చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్‌ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని (యూతనేషియా) ఎంచుకుంది. వైద్యులు ఇచ్చే ఓ  మెడికేషన్‌తో ఆమె లోకాన్ని వీడనుంది. ఇందుకు మే నెలలో తేదీ ఖరారైంది. జోరాయా చాలా కాలంగా డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా ఆమెకు వ్యాధుల నుంచి విముక్తి లభించలేదు. మరే ఇతర చికిత్సలూ లేవని వైద్యులు చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. 

జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె లోకాన్ని వీడనుంది. ఈ ప్రక్రియలో భాగంగా వైద్యులు ఆమెకు మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. దీంతో, అచేతన స్థితిలోనే లోకాన్ని వీడుతుంది. 2001లోనే నెదర్‌లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్‌లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే. 

కారుణ్య మరణానికి చట్టబద్ధత కల్పించడంపై ప్రస్తుతం అక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది మానసిక వ్యాధులతో జీవించలేక మరణాన్ని ఎంచుకుంటున్నారు. ‘‘చాలా మంది కారుణ్య మరణాన్ని ఆమోదయోగ్యంగా భావిస్తున్నారు. ఒకప్పుడు చివరి ప్రత్యామ్నాయంగా ఉన్న దీన్ని ఇప్పుడు వైద్యులు సులభంగా తన పేషెంట్లకు సూచిస్తున్నారు. యువ పేషెంట్లు ఎక్కువగా కారుణ్య మరణాన్ని ఎంచుకుంటున్నారు’’ అని థియోలాజికల్ యూనివర్సిటీ కాంపెన్‌లోని హెల్త్ కేర్ ఏథిసిస్ట్ స్టెఫ్ అన్నారు.
Euthanasia
Dutch womam
Mental Health

More Telugu News