Lemon: మండుతున్న ఎండలు.. కొండెక్కిన నిమ్మకాయ ధరలు

  • 40 శాతం మేర తగ్గిన నిమ్మ దిగుబడి
  • ఒక్కో నిమ్మకాయ ధర రూ. 10 పైనే
  • హోల్‌సేల్ మార్కెట్లోనే రూ. 7 పలుకుతున్న ధర
  • మున్ముందు మరింత పెరిగే అవకాశం
Lemon Rates High This Summer Reason Is This

వేసవి తాపం రోజురోజుకు పెరుగుతుండడంతో అదే స్థాయిలో నిమ్మకాయల ధరలు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు దొరకగా, నేడు వాటి ధర రూ. 40కి పెరిగింది. విడిగా అయితే ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. నిమ్మకాయలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కర్ణాటకలో ఈసారి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది.  

నెల రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్‌లో పెద్ద సైజు నిమ్మకాయలు వెయ్యి రూ. 2 వేల ధర పలకగా, ప్రస్తుత వాటి ధర రూ. 7 వేలకు పైగా పలుకుతోంది. అంటే నెల రోజుల్లోనే ధర దాదాపు 350 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా నిమ్మ సాగవుతుంది. ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. రైతులు వీటిని స్థానికంగా విక్రయించడంతోపాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతాతోపాటు చెన్నై మీదుగా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గడంతో స్థానికంగానే నిమ్మకాయలకు కరవు ఏర్పడింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ఆ మేరకు ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటి ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

More Telugu News