Gayathri Siddeshwara: వారికి వంట చేయడం మాత్రమే తెలుసు.. బీజేపీ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు

Congress MLAs Sexist Remark On BJP Leader Gayathri Siddeshwara Sparks Row
  • బీజేపీ దావణగెరె అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు
  • ప్రతిపక్ష పార్టీకి ప్రజల ముందు మాట్లాడే ధైర్యం లేదన్న శివశంకరప్ప
  • మహిళలు ఏ వృత్తిలో లేరో చెప్పాలన్న గాయత్రి
  • కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే షమానూర్ శివశంకరప్ప వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ దావణగెరె లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో శివశంకరప్ప మాట్లాడుతూ.. గాయత్రి విద్యార్హతలను ప్రస్తావించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఆమెకు లేదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి మోదీకి ఆమె కమలం పువ్వు ఇవ్వాలనుకుంటున్నారని, తొలుత ఆమె దావణగెరె సమస్యలు తెలుసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో తాము (కాంగ్రెస్) అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియాలని పేర్కొన్న ఆయన.. వారికి వంటింట్లో వంట చేయడం మాత్రమే తెలుసని నోరు పారేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజల ముందు మాట్లాడే ధైర్యం లేదని పేర్కొన్నారు. 

92 ఏళ్ల శివశంకరప్ప దావణగెరె సౌత్ నుంచి ఐదుసార్లు గెలిచారు. పార్టీలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యే ఆయనే. రానున్న ఎన్నికల్లో ఆ స్థానంలో ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ కాంగ్రెస్ తరపున పోటీపడుతున్నారు. శివశంకరప్ప వ్యాఖ్యలపై గాయత్రి స్పందించారు. మహిళలు పలు రంగాల్లో సత్తా చాటుతున్నారని, పురుషుల ఆధిపత్యం కలిగిన రంగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.

‘‘మహిళలు వంట గదికే పరిమితం కావాలని ఆయన (శివశంకరప్ప) చెబుతున్నారు. మహిళలు ఈ రోజుల్లో ఏ వృత్తిలో లేరో చెప్పండి? మేం ఆకాశంలోనూ సత్తా చాటుతున్నాం. ఆ వృద్ధ నాయకుడికి మహిళలు ఎంతగా పురోగమిస్తున్నారో ఆయనకు తెలియదు. మహిళలు పురుషుల కోసం ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదు’’ అని దుమ్మెత్తి పోశారు. శివశంకరప్ప వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Gayathri Siddeshwara
Shamanur Shivashankarappa
Karnataka
Congress
BJP

More Telugu News