Chandrababu: జగన్ కు సపోర్ట్ చేస్తారా? సునీతకు సపోర్ట్ చేస్తారా?: చంద్రబాబు

  • కదిరిలో ప్రజాగళం సభ
  • నిన్న వైఎస్ సమాధి సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పాడని విమర్శలు
  • జగన్ నిన్న నంగనాచిలా మాట్లాడాడని వ్యాఖ్యలు
  • హత్య చేసిన వారిని శిక్షించడానికి మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ 
Chandrababu targets CM Jagan in Kadiri Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. బాబాయ్ ని చంపింది ఎవరు? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముద్దాయి అవినాశ్ రెడ్డిని పక్కన పెట్టుకుని, వైఎస్సార్ సమాధి సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 

తనకు న్యాయం చేయాలని సునీత కోరుతున్నారు... ఓ ఆడబిడ్డ ఆవేదన విన్నారు కదా... జగన్ కు సపోర్ట్ చేస్తారా? సునీతకు సపోర్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

"హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదని చెబుతున్నాం. నిన్న నంగనాచిలా మాట్లాడాడు. ఇప్పుడు మనం కదిరిలో ఉన్నాం... పక్కనే పులివెందుల ఉంది. పులివెందులలో గొడ్డలివేటు వేస్తే కదిరికి వినిపిస్తుందా, లేదా? ఆ గొడ్డలి ఇక్కడే తయారైందని వార్తలు వచ్చాయి. నిన్న చెబుతున్నాడు... కలియుగంలో నాపై ఆరోపణలు చేస్తున్నారు, నాకేమీ అర్థం కావడంలేదు, మా చిన్నాన్నను చంపేశారు అంటూ మళ్లీ మొదటికొచ్చాడు డ్రామారాయుడు, కరకట్ట కమలహాసన్. 

బాబాయ్ ని చంపింది ఎవరో ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. కానీ జగన్ ఏమంటున్నాడో తెలుసా... బాబాయ్ ని చంపింది ఎవరో దేవుడికే తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు అని చెబుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలా? 

ఇవాళ తెలంగాణ హైకోర్టు వద్ద వివేకా కుమార్తె సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ ఆమె జగన్ కు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆమె ఆవేదన విన్న తర్వాత మనసున్న వాళ్లు ఏంచేస్తారు? ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి, మళ్లీ ఆ నేరాలను మనపై నెట్టాలనుకుంటున్నాడు. హత్యారాజకీయాలపై ప్రజలకు ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎవరు హత్య చేసినా శిక్షించాలి... దానికి మీరు సిద్ధమా?" అంటూ చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ కదిరి పర్యటన సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కదిరి ఎస్ఆర్ఎస్ఎన్ కాలేజీలో ఏర్పాటు  చేసిన ఈ ఇఫ్తార్ విందులో చంద్రబాబు ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.

More Telugu News