Narendra Modi: సీజేఐకి న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

  • న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సీజేఐకి న్యాయవాదుల లేఖ
  • ఇతరులను వేధించడం... బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని విమర్శ
  • స్వార్థప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారని... కానీ దేశంపై ఎలాంటి నిబద్ధత చాటుకోరని వ్యాఖ్య
PM Modi attacks Congress over lawyers letter to CJI

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు... సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇతరులను వేధించడం... బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. అయిదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చిందన్నారు. స్వార్థప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారని... కానీ దేశంపై ఎలాంటి నిబద్ధత చాటుకోరని విమర్శించారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

న్యాయవాదుల లేఖలో ఏముంది?

రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థశక్తులు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని న్యాయవాదులు తాము రాసిన లేఖలో పేర్కొన్నారు. కోర్టులపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించవద్దని, ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లవుతుందన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో హరీశ్ సాల్వే సహా పలువురు లాయర్లు ఉన్నారు.

More Telugu News