Saroja: దేశపు జెండాకు ఉన్నంత పొగరు పవన్ కల్యాణ్ కే కాదు... మాకు కూడా ఉంటుంది: కాకినాడ మాజీ మేయర్ సరోజ

Kakinada ex mayor Saroja take a jibe at Janasena top brass
  • కాకినాడ జనసేనలో తిరుగుబాటు బావుటా
  • టికెట్ ఇవ్వలేదంటూ సరోజ ఫైర్
  • ఐదేళ్లు పార్టీ కోసం కుక్కలా పనిచేశానంటూ వెల్లడి
  • తప్పకుండా వేరే పార్టీలోకి వెళతానని స్పష్టీకరణ
  • కాకినాడ అర్బన్, రూరల్ జనసేన అభ్యర్థులను ఓడించి తీరతానని శపథం 
ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లోనే పోటీ చేస్తోంది. దాంతో, టికెట్ పై ఆశలు పెంచుకున్న ఆ పార్టీ నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వారిలో పలువురు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కొందరు జనసేనాని పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లను సైతం ఏకిపారేస్తున్నారు. 

టికెట్ దక్కనివారిలో కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా ఉన్నారు. ఆమె ఇవాళ కూడా జనసేన నాయకత్వంపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని, ఈసారి కాదమ్మా... మీకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని సరోజ వెల్లడించారు. పవన్ కల్యాణ్ కోసం తాను వర్క్ కూడా చేశానని తెలిపారు. 

కానీ ఆ తర్వాత ప్రతి చోటా అవమానాలు, అవహేళనలే ఎదురయ్యాయని సరోజ వాపోయారు. 

"కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నేత పిల్లి అనంతలక్ష్మితో పాటు నేను కూడా గ్రామగ్రామాన పర్యటించాను. సరోజ వస్తే నేను రాను... మా అనుచరులను కూడా పంపించను, ఆవిడను ఎందుకు వెనకేసుకుని తిరుగుతున్నారు? అని పంతం నానాజీ టీడీపీ నేతలతో చెప్పడం జరిగింది. నన్ను ఎక్కడికక్కడ అడ్డుకుని, మీరెందుకు వచ్చారు, మీ మెడలో కండువాలు తీసేయండి అనేవారు. నాకు వ్యతిరేకంగా రోడ్డుపై ధర్నాలు చేసేవారు. పవన్ కల్యాణ్ గారు ఎప్పటికైనా తెలుసుకుంటారులే అని అన్నీ భరించాను. 

కానీ, ఇవన్నీ పవన్ కల్యాణ్ కు చెప్పాలనుకుంటే, ఆయన వద్దకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వడంలేదు. ఎక్కడికక్కడ తొమ్మిది అంచెల భద్రత ఉంటుంది. ఆయనను కలవాలి అనుకుంటే ఒక రూమ్ కూడా దాటలేం. ఒక రెసిడెన్షియల్ కాలేజి లాగా అన్ని చోట్లా తాళాలు వేసుకుని, ఇంత పెద్ద బౌన్సర్లు ఉంటారక్కడ. ఎవరైనా కిడ్నాప్ చేస్తారనా అంత భారీ ఏర్పాట్లు చేసుకున్నారు? లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు. 

ఇన్నాళ్లు వేచి చూసి, నా కడుపులో దాచుకున్నదంతా ఇవాళ బయటపెడుతున్నాను. నా పార్టీ, మా అధ్యక్షుడు అని ఇన్నాళ్లు అన్నీ సహించాను. పవన్ కల్యాణ్ గారు న్యాయం చేస్తారని ఆశించాను. 

కాకినాడ అర్బన్ లో కానీ, కాకినాడ రూరల్ లో కానీ మీరు పర్యటించవద్దు అని నాదెండ్ల మనోహర్ గారు నాకు సూచనలు చేశారు. ఎందుకిలా అవమానిస్తున్నారు? అంటూ నాదెండ్ల మనోహర్ గారికి మెసేజ్ పెడితే... అలాంటివేవీ పెట్టుకోవద్దమ్మా, మనందరం ఒకటే అని చెప్పారు. దాంతో అప్పటికి సర్దిపుచ్చుకున్నాను. మళ్లీ ఇన్ని అవమానాలు జరుగుతుంటే, మనోహర్ గారి వద్దకు వెళ్లి చెప్పాను. వాళ్లకు ఉండాలమ్మా బుద్ధి... వాళ్లకు లేకపోతే ఏం చేస్తాం... వాళ్లే నష్టపోతారు అన్నారు. 

ఎప్పుడూ కూడా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. పవన్ కల్యాణ్ కే కాదు... ఆత్మాభిమానం మాకు కూడా ఉంటుంది. దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఆయనకే కాదు... నాకు కూడా ఉంటుంది. ఆ పొగరుతోనే ఇవాళ బయటికి వచ్చేశాను, ఆ పొగరుతోనే ఇవాళ చెబుతున్నాను... ఏ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటుందో, ఏ పార్టీలో నా జాతి గౌరవం నిలబడుతుందో, ఏ పార్టీలో మహిళలకు సముచిత గౌరవం లభిస్తుందో... ఆ పార్టీలోనే ఉంటాను. 

ఐదేళ్ల పాటు జనసేన పార్టీ కోసం కుక్కలా కష్టపడి పనిచేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ గా ఉండలేను. ఇప్పుడు నాకొక వేదిక కావాలి... తప్పకుండా వేరే పార్టీలోకి వెళతాను... ఎవరైతే కాకినాడ రూరల్, అర్బన్ లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తారో వాళ్లను ఓడించి తీరతాను" అంటూ సరోజ శపథం చేశారు.
Saroja
Kakinada
Pawan Kalyan
Nadendla Manohar
Janasena
Andhra Pradesh

More Telugu News