Arvind Kejriwal: కేజ్రీవాల్ కేసును ఈ రాత్రికే విచారించాలని సుప్రీంకోర్టును మరోసారి కోరిన న్యాయవాది

Kejriwal advocate files petition in Supreme Court against Delhi High Court orders
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచారణ
  • కేజ్రీవాల్ కు అరెస్ట్ నుంచి మినహాయింపులు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
  • వెంటనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
  • ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేజ్రీవాల్ న్యాయవాది
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి, ఆయనను విచారించి, ఆపై అరెస్ట్ చేశారు. 

దీనిపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మార్లెనా స్పందిస్తూ, ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాలే తమ ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని వెల్లడించారు. ఢిల్లీ సర్కారును కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అతిషి పేర్కొన్నారు. ఈ రాత్రికే అత్యవసరంగా విచారించాలని కోరతామని చెప్పారు. 

ఈ నేపథ్యంలో, ఢిల్లీ హైకోర్టు  తీర్పును కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమ పిటిషన్ ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. పిటిషన్ ను రేపు విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇవాళ రాత్రికే విచారించాలని కేజ్రీవాల్ న్యాయవాది సుప్రీంకోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
Arvind Kejriwal
Arrest
ED
Delhi Liquor Scam
Supreme Court
Delhi High Court

More Telugu News