Nara Bhuvaneswari: అవినీతిపరులను అడ్డుకుందాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: నారా భువనేశ్వరి

Let us protect the state from YSRCP govt says Nara Bhuvaneshwari
  • ధైర్యంగా బయటకు వచ్చి న్యాయం కోసం నిలబడాలి
  • రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి
  • టీడీపీ శ్రేణులు, కార్యకర్తలకు నారా భువనేశ్వరి పిలుపు
రాష్ట్రంలో తిష్ఠవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని, వారి చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా కార్యకర్తలకు ఈ మేరకు ఆమె దిశానిర్దేశం చేశారు.

చంద్రబాబు పాలనలో ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందని అన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని మండిపడ్డారు.. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ పక్కనున్న రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులుపడుతున్నారు. టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలిపారిపోతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని సహా తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులను గత 5ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలి’’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలని, ఎవరు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడాలని టీడీపీ శ్రేణులకు ఆమె సూచించారు. తెలుగుదేశం జెండాను ఎగరేయాలన్నారు. ‘‘చంద్రబాబు ఏం చేస్తారో అవే చెప్తారు. 2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడి సాయం, 18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. మహిళలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అలుపెరుగని పోరాటం చేశారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తెలుగుదేశంపార్టీ విజయానికి కృషి చేయాలి’’ అని భువనేశ్వరి కోరారు.
Nara Bhuvaneswari
Telugudesam
YSRCP
Andhra Pradesh
AP Assembly Polls
AP Politics

More Telugu News