Jaishankar: చైనా విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించినా నెహ్రూ ఉదాసీనంగా వ్యవహరించారు: జైశంకర్

  • చైనా విషయంలో నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం బుడగతో సమానమని వ్యాఖ్య
  • నెహ్రూకు అమెరికా అంటే కోపమని, అందుకే భారత్‌కు చైనా గొప్ప మిత్రదేశంగా చెప్పేవారన్న జైశంకర్
  • చైనానే మిత్రదేశంగా అప్పుడు అందరూ నమ్మేవారని వ్యాఖ్య
  • ఇప్పటికీ కొంతమంది ఇదే మాట చెబుతున్నారని ఎద్దేవా
  • 1950లలో భారత్‌కు అమెరికా దూరం కావడానికి చైనాయే కారణమని వెల్లడి
Need To Get Out Of Cult Worship That Nehru Era Was Great says S Jaishankar

చైనా విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పలుమార్లు హెచ్చరించినా నాటి ప్రధాని జవహర్ లాల్ పట్టించుకోలేదని, ఆయన ఉదాసీన వైఖరితో వ్యవహరించేవారని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించారు. బుధవారం ఓ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చైనా విషయంలో నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం బుడగతో సమానమన్నారు. ఆయనకు అమెరికా అంటే కోపమని, అందుకే భారత్‌కు చైనా గొప్ప మిత్రదేశంగా చెప్పేవారని, అప్పట్లో అందరూ దానినే నమ్మినట్లు చెప్పారు. ఇప్పటికీ కొంతమంది ఇదే మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్, చైనా వ్యవహారాలపై అప్పటి మంత్రులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అయినా నెహ్రూ పట్టించుకోలేదని ఆరోపించారు. హిమాలయాల మీదుగా ఆక్రమణకు ప్రయత్నిస్తారని అనుకోవడం లేదని చెప్పారని తెలిపారు. కానీ 1962లోనే చైనా అలాంటి దుశ్యర్చకు పాల్పడిందని గుర్తు చేశారు. 1950లలో భారత్‌కు అమెరికా దూరం కావడానికి చైనాయే కారణమన్నారు. ఈ అంశంపై నాటి న్యాయ శాఖ మంత్రి అంబేడ్కర్ కూడా నెహ్రూను ప్రశ్నించారన్నారు.

ఈ విషయాలు ఇప్పటి తరానికి తెలియవని... నెహ్రూ విదేశాంగ విధానాలనే తర్వాతి తరం పాలకులు అనుసరిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అదో తప్పుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ కాలం చాలా గొప్పది అనే భావన నుంచి బయటపడాలన్నారు.

More Telugu News