Fasting: 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్'తో గుండెపోటు మరణాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • 8 గంటల సమయంలోపు ఆహారం సమయం పాటించే వారిలో 91 శాతం మరణముప్పు
  • 16 గంటల ఆహార వేళలు పాటించే వారిలో తగ్గిన ముప్పు
  • తాజా అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు
  • ఎక్కువసేపు కడుపును ఖాళీగా ఉంచితే చావును కొనితెచ్చుకున్నట్టే!
Intermittent Fasting Linked To Risk Of Death From Heart Disease says new study

ఆహారపు అలవాట్లు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరు సమయ నియంత్రిత ఆహారపు అలవాట్లను పాటిస్తారు. అంటే రోజులో 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. మిగతా 16 గంటలు ఏమీ తీసుకోరు.. అంటే ఉపవాసం ఉంటారన్నమాట. ఇలాంటి వ్యక్తులు హృదయ సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు నిన్నటి నుంచి ఈ నెల 21 వరకు నాలుగు రోజులపాటు షికాగోలో జరగనున్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ఎడిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్/ లైఫ్ స్టైల్ అండ్ కార్డియోమెటబాలిక్ సైంటిఫిక్ సెషన్స్ 2024లో సమర్పించిన ప్రాథమిక పరిశోధన వివరాలు వెల్లడించాయి. 

ఏంటీ సమయ నియంత్రిత ఆహారం
ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఉపవాసం అన్నట్టే. ఆరోగ్యంపై శ్రద్ధచూపే కొందరు నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. అంటే రోజులో 8 గంటల్లోనే ఆహారాన్ని తీసుకోవడం ముగిస్తారు. అంటే మిగతా 16 గంటలు కడుపును ఖాళీగా ఉంచుతారు. వీరు 16:8 పద్ధతిని అనుసరించి ఆహారం తీసుకుంటారు. అంటే 8 గంటల విండోను కేటాయించుకుని ఆ ప్రకారమే ఆహారం తీసుకుంటారు. మిగిలిన సమయంలో పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయులు వంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని గత అధ్యయనం పేర్కొంది. 

కొంపముంచేది అదే
రోజుకు 8 గంటల వంటి ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుందన్నది చాలామంది భావన. దీంతో ఇటీవలి కాలంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు తెలియరాలేదు.  అయితే, తాజా అధ్యయనంలో మాత్రం గుండెలు అదిరిపోయే విషయాలు వెల్లడయ్యాయి. 

మరణ ముప్పు 91శాతం
20 వేలమందిపై జరిపిన అధ్యయనంలో 8 గంటల సమయ నియంత్రిత ఆహారం తీసుకొనే వారిలో హృదయ సంబంధిత మరణాల ముప్పు 91 శాతం ఉన్నట్టు వెల్లడైంది.  గుండె జబ్బులు, కేన్సర్ వంటి వాటితో బాధపడే వ్యక్తుల్లో గుండె సంబంధిత మరణాలు సంభవిస్తాయని తేలింది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతూ 8 గంటల ఆహార నియమం పాటిస్తే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటితో మరణించే ముప్పు 10 గంటల ఆహార నియమం పాటించే వారితో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఏది ఏమైనా సమయ నియంత్రిత ఆహారం మరణముప్పును ఏమాత్రం తగ్గించలేదని అధ్యయనం తేల్చింది. 16 గంటల ఆహార నియమం పాటించే కేన్సర్ బాధితుల్లో మరణాల ముప్పు గణనీయంగా తగ్గింది. సమయ నియంత్రిత ఆహారంపై కఠిన వాస్తవాలు వెల్లడైనప్పటికీ దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News