Volunteers: త్వరలో ఎన్నికలు... వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు

  • వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న సీఎస్
  • వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగానూ ఉండరాదని స్పష్టీకరణ
  • వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టేనని వెల్లడి
CS Jawahar Reddy orders passed to district collectors on volunteers

ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి వాలంటీర్ల విషయంలో జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

ఎన్నికలతో  ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తక్షణమే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టేనని అన్నారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగానూ ఉండరాదని తేల్చి చెప్పారు. 

కాగా, రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, సీఎస్ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏపీలో విపక్షాలు వాలంటీర్ల పాత్రపై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశాయి. 

అటు, వాలంటీర్ల విషయంలో సీఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదంటూ సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. 

ఎందుకు సీఈసీ ఆదేశాలను పాటించడంలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తగిన చర్యలు చేపట్టాలని ఏపీ సీఈవోను ఆదేశించింది. ఈ క్రమంలో, ఏపీ సీఎస్ నేడు వాలంటీర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

More Telugu News