Mallu Bhatti Vikramarka: వారికి మాత్రమే ఇస్తాం... రైతుబంధుపై మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన

  • కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని వెల్లడి
  • ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామన్న మల్లు భట్టి
  • త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామని స్పష్టీకరణ
  • వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామన్న మల్లు భట్టి
  • విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
Mallu Bhatti key comments on Rythu Bandhu

రైతుబంధుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని... త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టేది లేదన్నారు.

రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామన్నారు. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 12వ తేదీ నుంచి ఇందిరా క్రాంతి పేరుతో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కాళేశ్వరం, కొన్ని విద్యుత్ ప్రాజెక్టులను తాము నిరర్థక ఆస్తులుగా వదిలేయమని వెల్లడించారు. గృహలక్ష్మిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యుత్ ఛార్జీలు పెంచబోం

విద్యుత్ ఛార్జీలు కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతున్నా తాము ఇస్తున్నామన్నారు. మరింత కరెంట్ వినియోగం పెరిగినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో 16వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కూడా సిద్ధమన్నారు. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని తెలిపారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సోలార్ విద్యుత్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 40,33,702 జీరో బిల్లులు ఇచ్చామన్నారు.

More Telugu News