Bengaluru: బెంగ‌ళూరులో తీవ్ర నీటి ఎద్ద‌డి.. మాల్స్‌లోని టాయిలెట్ల‌కు క్యూక‌డుతున్న జ‌నాలు

  • ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న అద్దెదారులు
  • స్నానాల‌ కోసం జిమ్‌లకు వెళ్తున్న వైనం
  • క‌రవు జిల్లాలుగా బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్ 
  • తోటపని, నిర్మాణం, నీటి ఫౌంటెన్‌ల వంటి వాటికి తాగు నీటిని ఉపయోగించడంపై నిషేధం
  • ఆకాశా‌న్నంటిన నీటి ట్యాంక‌ర్ల ధ‌ర‌లు.. గగ్గోలు పెడుతున్న జ‌నాలు
Bengaluru resident claims people visiting malls to use washrooms amid water crisis

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని ప్ర‌జ‌ల‌ను తీవ్ర నీటి ఎద్ద‌డి వేధిస్తోంది. తీవ్రమైన నీటి సంక్షోభం కార‌ణంగా గేటెడ్ క‌మ్యూనిటీల్లో నివ‌సించే ప్ర‌జ‌లు కూడా నీరు లేక‌ అవ‌స‌రాల కోసం వాష్‌రూమ్‌లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్స్‌కు వెళ్తున్నారని అక్క‌డి ఓ నివాసితుడు తెలిపాడు. స్నానాల‌ కోసమైతే ఏకంగా జిమ్‌లకు వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్ మీడియా వెబ్‌సైట్ రెడ్డిట్‌ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి స‌మ‌స్య‌ను ఆ నివాసి తెలియ‌జేశాడు. ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఆ వ్య‌క్తి తమకు నెల మొత్తం కూడా చుక్క‌ నీరు రావడం లేదని వాపోయాడు.

ఆ వ్య‌క్తి ఇంకా మాట్లాడుతూ.. "చాలా మంది అద్దెదారులు త‌మ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు తాత్కాలిక వసతికి మారారు. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నీరులేక‌ టాయిలెట్ల‌ దుర్వాస‌నను మీరు చాలా దూరం నుండి పసిగట్టవచ్చు. నివాసితులు ప్ర‌తిరోజు తమ కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డానికి సమీపంలోని ఫోరమ్ మాల్‌కు వెళ్లడం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది" అని ఆ వ్య‌క్తి త‌న‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

"కొంతమంది ఏకంగా జిమ్‌లకు ఒక జత బట్టలు, టవల్‌తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు" అని చెప్పాడు. నగరంలో ట్యాంకర్ వాటర్‌పై ఆధారపడి ఎట్టిప‌రిస్థితుల్లో ఫ్లాట్‌లను కొనవద్దని అత‌డు ప్రజలను కోరాడు.

బెంగళూరులో నీటి సంక్షోభం
బెంగళూరు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్ జిల్లాలను ఇప్ప‌టికే కరవు జిల్లాలుగా ప్రకటించ‌డం జ‌రిగింది. వాహనాలు కడగడం, తోటపని, నిర్మాణం, నీటి ఫౌంటెన్‌ల వంటి వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (బీడ‌బ్ల్యూఎస్ఎస్‌బీ) గ‌త శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక‌వేళ ఎవ‌రైనా ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘిస్తే రూ. 5వేల జరిమానా విధించడం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. నీటి ఎద్దడి నెలకొని ఉన్న తరుణంలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే వ్యాపారులు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారట‌. నీటి ట్యాంక‌ర్ల‌కు విపరీతమైన ధరలు వసూలు చేస్తున్నారని బెంగ‌ళూరు వాసులు వాపోతున్నారు.

More Telugu News