Naveen Patnaik: పొడుస్తున్న పొత్తు.. 15 ఏళ్ల తర్వాత ఎన్‌డీఏ గూటికి బీజేడీ?.. కీలక పరిణామాలు

  • బీజేడీ నాయకులతో చర్చలు జరిపిన సీఎం నవీన్ పట్నాయక్
  • ఢిల్లీలో కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన రాష్ట్ర బీజేపీ నాయకులు
  • 2009లో విడిపోయిన ఇరు పార్టీలు
  • లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు పొత్తు దిశగా అడుగులు
Naveen Patnaik BJD Hints At Pact With BJP

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ దాదాపు 15 ఏళ్ల  తర్వాత తిరిగి ఎన్డీయేతో చేతులు కలపబోతోందనీ, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోందనీ తెలుస్తోంది. ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై బుధవారం సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం ‘నవీన్ నివాస్‌’లో బీజేడీ నేతల విస్తృతమైన సమావేశం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్‌తో పాటు కీలక నేతలు హస్తినలో చర్చలు జరిపారు. ఎన్నికల వ్యూహాలు, బీజేడీతో పొత్తు అవకాశాలపై సంప్రదింపులు జరిపారు.

ఇరు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని అన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ ఒడిశా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు.

2009లో ఏం జరిగింది?
ఒడిశాలో గతంలో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు విజయవంతంగా కొనసాగింది. ఫిబ్రవరి 1998లో పొత్తు కుదరగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. దీంతో ఒకప్పుడు బీజేపీకి అత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షంగా బీజేడీ కొనసాగింది. అయితే 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. చర్చలు విఫలమవ్వడంతో 2009లో కూటమి చీలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 63 స్థానాలకు బదులు 40 సీట్లు, పార్లమెంట్ సీట్లను 9 నుంచి 6కి తగ్గిస్తూ బీజేడీ ఆఫర్ చేయడం పొత్తు తెగదెంపులకు కారణమయింది. కాగా ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

More Telugu News