BJP: ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని బీజేపీ... అందుకేనా...?

  • ఎన్నికల సమరశంఖం మోగించిన బీజేపీ
  • 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితా
  • తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • ఏపీలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్న బీజేపీ హైకమాండ్
  • టీడీపీ-జనసేన కూటమితో పొత్తు కుదిరే అవకాశం!
BJP yet to announce AP candidates for Lok Sabha elections

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాల పేర్లతో కూడిన లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేడు ప్రకటించింది. ఈ జాబితాలో 195 మందికి స్థానం కల్పించారు. 34 మంది కేంద్ర మంత్రులు మరోసారి టికెట్ దక్కించుకున్నారు. 

ఈ తొలి జాబితాలో వివిధ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. ఏపీలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొని ఉండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. 

జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అదే సమయంలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులోకి బీజేపీ వస్తుందా, రాదా? అనే అంశం ఇప్పటిదాకా అనిశ్చితి సృష్టించింది. ఇప్పుడు తొలి జాబితాలో ఏపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం చూస్తుంటే... టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంపై బీజేపీ వేచి చూసే ధోరణి కనబరుస్తోందని అర్థమవుతోంది.

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. పొత్తులపై ఆయన రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అదే సమయంలో, ఏపీలో పొత్తు లేకుండా ఒంటరిగా ముందుకు వెళ్లడంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు పొత్తు లేకపోతే గెలిచే అవకాశాలు లేవని చెప్పగా, మరికొందరు నేతలు ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. నేటి సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పొత్తుపై బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఏపీలో లోక్ సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు అర్థమవుతోంది. 

టీడీపీ, జనసేనలతో చర్చించి సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ తర్వాతే ఏపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై ఓ ప్రకటన చేశాయి. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉండగా, ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే... టీడీపీ ఎన్ని స్థానాలు  తీసుకుంటుంది? బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, రెండో జాబితాలో జనసేనకు మరికొన్ని ఎంపీ స్థానాలు ఇస్తారా? అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

More Telugu News