K Kavitha: కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court to hear Kavitha petition on ED notices
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు
  • నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కవిత
  • ఇదే కేసులో కవితకు సీబీఐ నోటీసులు కూడా జారీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను ఈడీ విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది. 

మరోవైపు ఇదే స్కామ్ లో కవితకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవితను... సీబీఐ నిందితురాలిగా మార్చింది. దీంతో, ఈ కేసులో కవితకు ఉచ్చు బిగుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే, ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. గతంలో ఇచ్చిన సెక్షన్ 160 నోటీసుకు 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పారు.
K Kavitha
BRS
Delhi Liquor Scam
Supreme Court

More Telugu News