కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ షర్మిల ఫోకస్.. నేడు, రేపు కీలక భేటీలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో షర్మిల సంప్రదింపులు
- అభ్యర్థులపై అవగాహనకు వచ్చాక అధిష్ఠానానికి జాబితాను పంపించనున్న ఏపీసీసీ చీఫ్
- అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం
టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారితో ముఖాముఖీ మాట్లాడిన తర్వాత టికెట్లపై షర్మిల ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి. అనంతరం ఆ జాబితాను ఏఐసీసీ ఆమోదానికి పంపనున్నారని తెలుస్తోంది. అధిష్ఠానం ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,100 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు నిర్వహించనున్న ముఖాముఖీలో భాగంగా నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో మాట్లాడనున్నారు. ఇక రేపు శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుదారులతో చర్చించనున్నారు.