బిడ్డ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారేమో.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానం: బండి సంజయ్
- లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఉంటే కవితపై చర్యలు తప్పవన్న బండి సంజయ్
- బీజేపీ 370 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని విమర్శ
దేశంలో రామరాజ్య పరిపాలన కొనసాగాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ పాలనపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సారి బీజేపీ 370 సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో తమకు పోటీ కాంగ్రెస్ పార్టీతోనే అని అన్నారు. బీఆర్ఎస్ ది మూడో స్థానమని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని... అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారం చేశారని... తాము కలిసి పోటీ చేశామా? అని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో లోక్ సభకు పోటీ చేయబోయే అభ్యర్థులను ఐదారు రోజుల్లో ప్రకటిస్తామని సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులు, గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రజాహిత యాత్రలో ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనే వారిని చెంపలు వాయించి, చెప్పుతో కొడతామని హెచ్చరించారు.