Farmers: రైతులపై మరోమారు టియర్ గ్యాస్ ప్రయోగం.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

  • కేంద్రంతో చర్చలు ఫలించకపోవడంతో మళ్లీ రైతుల ఆందోళన
  • పార్లమెంట్ ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమైన రైతులు
  • సరిహద్దుల వద్ద అడ్డుకున్న పోలీసులు
Tear Gas Fired As Farmers Prepare To Resume Delhi March

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు.. బుధవారం మరోమారు నిరసనలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు చెబుతున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు.

ఐదో రౌండ్ చర్చలకు కేంద్రం ఆహ్వానం..
ఆదివారం రాత్రి జరిగిన చర్చలలో ఐదేళ్ల కాంట్రాక్టుతో పప్పు ధాన్యాలు, పత్తి సహా పలు పంటలను కొనుగోలు చేస్తామని, ఈ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. సోమవారం రాత్రి వరకు కేంద్రం ప్రతిపాదనపై చర్చించిన నేతలు.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అసంబద్ధంగా ఉందని, దీనికి తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనాలని, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకూ ఢిల్లీ బార్డర్ల నుంచి తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. బార్డర్లలో నే ఉంటూ ఢిల్లీలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. మరింతమంది రైతులతో కలిసి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఐదో రౌండ్ చర్చలకు రావాలంటూ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

More Telugu News