Etela Rajender: మల్కాజిగిరి నుంచి పోటీకి సిద్ధమన్న ఈటల రాజేందర్

  • అధిష్ఠానం ఆదేశిస్తే లోక్ సభ బరిలో నిలబడతానని వెల్లడి
  • యాదాద్రిలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వ్యాఖ్య
  • మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని ప్రశంసలు 
Ready To Contest From Malkajigiri In Up comming Lok Sabha Polls Says Etala Rajender

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. మూడోసారీ మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజల్లో ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయని వివరించారు. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది నిజమే అయినా రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచడంలో ఆర్టీసీ, ప్రభుత్వం విఫలమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం అప్పుల పాలైందని, కొత్త అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. కాగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News