సైన్యాన్ని మోసంచేసి పారిపోయిన రష్యా పైలట్.. స్పెయిన్ లో దారుణ హత్య
- బుల్లెట్ గాయాలతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
- ఉక్రెయిన్ తో చేతులు కలిపిన రష్యన్ పైలట్
- గతేడాది రష్యన్ హెలికాఫ్టర్ తో ఉక్రెయిన్ లో ల్యాండింగ్
- పైలట్ ను తుదముట్టించాలని రష్యా సైన్యం స్టాండింగ్ ఆర్డర్
ఎవరీ కుజుమినోవ్..
మాక్సిమ్ కుజుమినోవ్ రష్యా మిలటరీలో పైలట్.. ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ ను నడుపుతుండేవాడు. తన విధుల్లో భాగంగా గతేడాది ఆగస్టులో యుద్ధ విమానాల విడి భాగాలను రష్యా మిలటరీ బేస్ లకు చేర్చేందుకు బయలుదేరాడు. హెలికాఫ్టర్ లో కుజుమినోవ్ తో పాటు మరో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఆర్మీ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన తర్వాత కుజుమినోవ్.. ఆర్మీ బేస్ లో కాకుండా ఉక్రెయిన్ భూభాగంలో హెలికాఫ్టర్ ను దింపాడు. ఉక్రెయిన్ తో చేతులు కలిపి రష్యా ఆర్మీని మోసం చేశాడు.
యుద్ధ విమానాల విడిభాగాలను ఉక్రెయిన్ ఆర్మీకి అప్పగించాడు. ఆ తర్వాత స్పెయిన్ పారిపోయి, మారుపేరుతో ఉక్రెయిన్ వీసాతో రహస్య జీవితం గడుపుతున్నాడు. ఈ మోసాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా మిలటరీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘జీఆర్ యూ’.. కుజుమినోవ్ ను తుదముట్టించేందుకు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పెయిన్ లో కుజుమినోవ్ ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.