India: అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో పతనమైన భారత్ ర్యాంకు

India rank slipped in Henley Passport Index 2024
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు పతనమైంది. గతేడాదితో పోల్చితే ఒక్క స్థానం పతనమై 84వ ర్యాంకు నుంచి 85వ ర్యాంకుకు పడిపోయింది. ప్రఖ్యాత హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్-2024 నేడు విడుదలైంది. 

ఈ సూచీలో భారత్ ర్యాంకు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే... గతేడాది భారత్ పాస్ పోర్టుతో 60 దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లే వీలుండేది. ఈ ఏడాది ఆ సంఖ్య 62 దేశాలకు పెరిగినప్పటికీ, ర్యాంకింగ్స్ లో భారత స్థానం పతనమైంది. భారత పర్యాటకులు వీసా లేకుండానే రావొచ్చంటూ గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్, మలేసియా, థాయ్ లాండ్ దేశాలు కూడా ప్రకటించాయి. 

ఇక, హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్-2024 జాబితాలో ఫ్రాన్స్ నెంబర్ వన్ గా నిలిచింది. ఫ్రాన్స్ పాస్ పోర్టు ఉంటే 194 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా పై వరుసలో ఉన్నాయి. 

అదే సమయంలో, హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ జాబితాలో పాకిస్థాన్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. గతేడాది పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా, ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ 101 నుంచి 102వ ర్యాంకుకు పడిపోయింది. 

ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ఇటీవల భారత్ తో సై అంటే సై అంటున్న మాల్దీవులు హెన్లీ పాస్ పోర్టు జాబితాలో 58వ ర్యాంకులో కొనసాగుతోంది. మాల్దీవుల పాస్ పోర్టుతో 96 దేశాలకు వీసా లేకుండా నిరభ్యంతరంగా వెళ్లిరావొచ్చు.
Go Back to Shorts
India
Passport
Henley Passport Index
Ranking
France

More Telugu News