dharmapuri arvind: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది... మోదీ మళ్లీ ప్రధాని అవుతారు: ధర్మపురి అరవింద్

  • పార్లమెంట్ పరిధిలో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చినట్లు వెల్లడి
  • 7 లక్షలపైన ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామన్న అరవింద్
  • మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వటం లేదని ధ్వజం
Dharmapuri Aravind says modi will win again

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీలో ఘర్‌వాపసి నడుస్తోందని... కాబట్టి బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చామన్నారు. 7 లక్షలపైన ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామన్నారు. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 68 శాతం ఓట్లు ఉన్నాయని... ఉత్తర భారతంలో కాంగ్రెస్‌కు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు రేటు రూ.13,999 గా ఉందన్నారు. ఈ ధర మరింతగా పెరుగుతుందన్నారు. గత రెండేళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసీస్ బోర్డు, పసుపు బోర్డు పని చేస్తోందన్నారు. కేంద్రం పసుపు ఎగుమతులు పెంచటం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో పసుపు రైతులకు మేలు చేకూరుతుందన్నారు. మోదీ ప్రపంచ దిశా నిర్దేశకుడని... రాజకీయ నాయకుడనే మాటకు అర్థాన్ని మార్చేసిన నేత ప్రధాని మోదీ అన్నారు.

More Telugu News