దేశంలో డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు: రోజా
- మోదీపై చంద్రబాబు ఎన్నో విమర్శలు చేశారన్న రోజా
- అమిత్ షా కారుపై రాళ్లు వేయించారని విమర్శ
- చంద్రబాబుతో కలవడం వల్ల బీజేపీకే నష్టమని వ్యాఖ్య
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదని రోజా అన్నారు. బీజేపీతో ఉన్నప్పుడు సొంత లాభాలను చూసుకుని... ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపారని... ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసేందుకు వెళ్తున్నారని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. సీఎం కావడం కోసం ఎవరితోనైనా కలిసేందుకు చంద్రబాబు సిద్ధపడతారని... ఈ విషయాన్ని మోదీ గమనించాలని చెప్పారు.
పురందేశ్వరితో కలిసి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారని... ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని రోజా చెప్పారు. ఇద్దరి మధ్య ఏ ఒప్పందం కుదిరిందో వాళ్లే చెప్పాలని అన్నారు. చంద్రబాబుతో కలవడం వల్ల బీజేపీకే నష్టమని చెప్పారు.